Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 48
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన.
1 మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద
యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.
 
2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం
సాఫోన్[a] ఎత్తైన స్థలంలా
అందంగా కనిపిస్తూ
సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.
3 దేవుడు ఆమె[b] కోటలలో ఉన్నారు;
ఆయనే దానికి కోట అని చూపించారు.
 
4 రాజులు దళాలతో కలిసి,
వారు ముందుకు వచ్చినప్పుడు,
5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు;
వారు భయంతో పారిపోయారు.
6 వారిలో వణుకు పుట్టింది,
ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.
7 తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా
మీరు వారిని నాశనం చేశారు.
 
8 మనం విన్నదే,
మనం చూశాం;
సైన్యాల యెహోవా పట్టణంలో,
మన దేవుని పట్టణంలో,
దేవుడు దాన్ని నిత్యం
సుస్థిరంగా ఉండేలా చేస్తారు.
సెలా
 
9 దేవా! మీ మందిరం మధ్యలో
మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.
10 ఓ దేవా, మీ పేరులా,
మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది;
మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
11 మీ తీర్పులను బట్టి
సీయోను పర్వతం ఆనందిస్తుంది
యూదా పట్టణాలు[c] సంతోషంగా ఉన్నాయి.
 
12 సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి,
దాని బురుజులెన్నో లెక్కించండి.
13 ఆమె గురించి రాబోయే తరం వారికి
మీరు చెప్పగలిగేలా,
దాని కోటగోడలను పరిశీలించండి,
దాని కోటలను చూడండి.
 
14 ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు;
ఆయన చివరి వరకు నడిపిస్తారు.

<- కీర్తనలు 47కీర్తనలు 49 ->