Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
ప్రధాన యాజకునికి శుభ్రమైన వస్త్రాలు
1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను[a] అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు. 2 అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.

3 అయితే యెహోషువ మురికిబట్టలు వేసుకుని దేవదూత ముందు నిలబడి ఉన్నాడు. 4 దూత తన ముందు నిలబడి ఉన్నవారితో, “అతని మురికిబట్టలు తీసివేయండి” అని చెప్పాడు.

అప్పుడు అతడు యెహోషువతో, “చూడు, నేను నీ పాపాన్ని తీసివేశాను, నీకు మంచి వస్త్రాలు వేస్తాను” అన్నాడు.

5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.

6 తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు: 7 “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను.

8 “ ‘ప్రధాన యాజకుడవైన యెహోషువా! విను; నీవూ, నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులు జరగబోయే వాటికి సూచనలుగా ఉన్నారు: చిగురు అనే నా సేవకుడిని నేను తీసుకురాబోతున్నాను. 9 నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడండి. ఆ రాయికి ఏడు కళ్లు ఉన్నాయి,[b] నేను దాని మీద ఒక శాసనం చెక్కుతాను, ఒకే రోజులోనే నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

10 “ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”

<- జెకర్యా 2జెకర్యా 4 ->