3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము. 4 మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, 5 ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. 6 ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనపై ధారాళంగా ఆత్మను కుమ్మరించాడు. 7 ఆయన కృప వల్ల మనల్ని నీతిమంతులుగా ప్రకటించి, మనం నిత్యజీవాన్ని పొందుతామని నమ్మకాన్ని ఇచ్చాడు. 8 ఇది నమ్మదగిన మాట. కాబట్టి దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, అందరికి ప్రయోజనకరమైనవి.
9 అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి. 10 విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి. 11 అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.
Languages