Link to home pageLanguagesLink to all Bible versions on this site
20
వెయ్యి సంవత్సరాలు
1 ఆ తర్వాత ఒక దేవదూత తన చేతిలో అగాధపు తాళపు చెవిని ఒక పెద్ద గొలుసును పట్టుకుని పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను. 2 ఆ దేవదూత ఆదిసర్పం అనే ఘటసర్పాన్ని అనగా అపవాది అనే సాతానుని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకు బంధించాడు. 3 ఆ దూత అతన్ని పాతాళంలో పడవేసి, అతడు వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యే వరకు దేశాలను ఎంత మాత్రం మోసం చేయకుండా ఉండడానికి దానికి తాళం వేసి ముద్ర వేశాడు. ఆ తర్వాత అతడు కొంతకాలం వరకు వదిలిపెట్టబడతాడు.

4 అప్పుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చుని ఉన్న సింహాసనాలను నేను చూశాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైనవారి ఆత్మలను నేను చూశాను. వారు ఆ మృగాన్ని గాని వాని విగ్రహాన్ని గాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద గాని చేతి మీద గాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు. 5 చనిపోయినవారిలో మిగిలినవారు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు మళ్ళీ బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. 6 మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.

సాతానుకు తీర్పు
7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు. 8 ఆ సాతాను భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుద్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉంది. 9 వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. 10 అప్పుడు వారిని మోసగించిన సాతాను అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడే ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడ్డారు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్ళు వేధించబడతారు.
మృతులకు తీర్పు
11 అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూశాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు. 12 ఆ తర్వాత దేవుని సింహాసనం ముందు సామాన్యులు గొప్పవారితో సహా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూశాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు. 13 సముద్రం దానిలో చనిపోయినవారిని అప్పగించింది. అలాగే మరణం పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. అప్పుడు ప్రతి ఒక్కరు తాము చేసిన పనుల ప్రకారం తీర్పు తీర్చబడ్డారు. 14 అప్పుడు మరణం పాతాళం అగ్నిగుండంలో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. 15 జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడనివారిని ఈ అగ్నిసరస్సులో పడవేశారు.

<- ప్రకటన 19ప్రకటన 21 ->