Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 14
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
1 “దేవుడు లేడు”
అని మూర్ఖులు[a] తమ హృదయంలో అనుకుంటారు.
వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి;
మంచి చేసేవారు ఒక్కరు లేరు.
 
2 వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా
అని యెహోవా పరలోకం నుండి
మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.
3 అందరు దారి తప్పి చెడిపోయారు;
మంచి చేసేవారు ఎవరూ లేరు.
ఒక్కరు కూడా లేరు.
 
4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?
 
వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;
వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.
5 వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు,
ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.
6 కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు,
కాని యెహోవా వారి ఆశ్రయము.
 
7 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది;
యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,
యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

<- కీర్తనలు 13కీర్తనలు 15 ->