23 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు,[b] యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’ 24 రైతులు, తమ మందలతో తిరిగే కాపరులతో సహా యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలందరూ కలిసి జీవిస్తారు. 25 అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.”
26 అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది.
27 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను మనుష్యుల సంతానంతో అలాగే జంతువుల సంతానంతో నాటే రోజులు రాబోతున్నాయి. 28 నేను వారిని పెరికివేయడానికి, కూల్చివేయడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి, విపత్తును రప్పించడానికి ఎలా ఎదురుచూశానో, అలాగే వారిని కట్టడానికి నాటడానికి నేను ఎదురుచూస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 29 “ఆ రోజుల్లో ప్రజలు,
“ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు,
పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు.
30 ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి.
31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ
యూదా ప్రజలతోనూ
క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.
32 ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల
చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు
నేను వారితో చేసిన
నిబంధనలా ఉండదు,
ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా,
వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
33 “ఆ కాలం తర్వాత,
ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి,
దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను.
నేను వారి దేవుడనై ఉంటాను,
వారు నా ప్రజలై ఉంటారు.
34 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు,
‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు,
ఎందుకంటే వారిలో,
సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి
వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
35 యెహోవా ఇలా చెప్తున్నారు,
పగలు ప్రకాశించడానికి
సూర్యుని నియమించినవాడు,
రాత్రి ప్రకాశించడానికి,
చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు,
కెరటాలు గర్జించేలా,
సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే,
ఆయన పేరు సైన్యాల యెహోవా:
36 “ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,”
అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
“ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట
ఒక జనంగా ఉండదు.”
37 యెహోవా ఇలా అంటున్నారు:
“పైన ఉన్న ఆకాశాలు కొలవబడగలిగితే,
అలాగే క్రింద ఉన్న భూమి పునాదులు పరిశోధించబడగలిగితే తప్ప,
వారు చేసినదంతటిని బట్టి
నేను ఇశ్రాయేలు సంతతివారందరిని తిరస్కరిస్తాను,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
38 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి. 39 కొలనూలు అక్కడినుండి నేరుగా గారేబు కొండ వరకు వెళ్లి, ఆపై గోయా వైపు తిరుగుతుంది. 40 శవాలను, బూడిదను విసిరే లోయ మొత్తం, తూర్పున కిద్రోను లోయవరకు గుర్రపు ద్వారం మూల వరకు ఉన్న డాబాలన్నీ యెహోవాకు పవిత్రంగా ఉంటాయి. పట్టణం ఇంకెప్పుడు పెరికివేయబడదు, కూల్చివేయబడదు.”