1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
2 “యూదా దుఃఖిస్తుంది,
ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి.
వారు భూమి కోసం విలపిస్తున్నారు,
యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి.
3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు;
వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు
కానీ నీళ్లు దొరకవు.
వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు;
నిరాశ నిస్పృహలతో,
వారు తమ తలలను కప్పుకుంటారు.
4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల
నేల చీలిపోయింది;
రైతులు సిగ్గుతో
తలలు కప్పుకున్నారు.
5 పొలంలో ఉన్న జింక కూడా
గడ్డి లేనందున
అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది.
6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి
నక్కల్లా రొప్పుతాయి.
మేత లేకపోవడంతో
వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”
7 మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా,
యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి.
ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం;
మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.
8 మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ,
ఆపద సమయంలో వారికి రక్షకుడవు,
దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు?
ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు?
9 నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు?
రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు?
యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు,
మేము మీ పేరును కలిగి ఉన్నాము;
మమ్మల్ని విడిచిపెట్టకండి!
10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు:
“వారికి తిరగడం అంటే చాలా ఇష్టం;
వారు తమ పాదాలను అదుపు చేసుకోరు.
కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు;
ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని
వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.”
11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు. 12 వారు ఉపవాసం ఉన్నప్పటికీ నేను వారి మొర వినను; వారు దహనబలులను భోజనార్పణలను అర్పించినప్పటికీ నేను వాటిని అంగీకరించను. నేను వారిని ఖడ్గంతో కరువుతో తెగులుతో నాశనం చేస్తాను.”
13 అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”
14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు[a] వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు. 15 కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు. 16 వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.