Link to home pageLanguagesLink to all Bible versions on this site

హెబ్రీయులకు
వ్రాసిన పత్రిక

1
దేవుని తుది వాక్కు: ఆయన కుమారుడు
1 గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు. 2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. 3 ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. 4 కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
కుమారుడు దేవదూతల కంటే ఉన్నతుడు
5 దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు,
“నీవు నా కుమారుడవు;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను”[a]
అని గాని,
“నేను అతనికి తండ్రిగా ఉంటాను,
అతడు నాకు కుమారునిగా ఉంటాడు,”[b] అని గాని అన్నారా?
6 దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన,
“దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,”[c] అని చెప్పారు.
7 దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు,
“ఆయన తన దూతలను ఆత్మలుగా,
తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,”[d]
అని అన్నారు.
8 కాని తన కుమారుని గురించి ఆయన,
“ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది;
మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.
9 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు;
కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి,
మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,”[e] అని అన్నారు.
10 ఇంకా ఆయన,
“ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,
ఆకాశాలు మీ చేతి పని.
11 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;
ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.
12 వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు;
వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి.
కానీ మీరు అలాగే ఉంటారు,
మీ సంవత్సరాలకు అంతం ఉండదు,”[f] అని అన్నారు.
13 దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా,
“నేను నీ శత్రువులను
నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”[g]?
14 దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?

హెబ్రీ పత్రిక 2 ->