5 ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. 6 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. 7 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో! 8 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు” అని అభినందించింది.
9 తర్వాత ఆమె రాజుకు 120 తలాంతుల[a] బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధద్రవ్యాలు వంటివి మరెప్పుడూ రాలేదు.
10 (హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తెచ్చారు; వారు చందనం, దూలాలు, వెలగల రాళ్లు కూడా తెచ్చారు. 11 ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి మెట్లను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. అంతకుముందు అలాంటివి యూదా ప్రదేశంలో ఎన్నడూ కనిపించలేదు.)
12 రాజైన సొలొమోను షేబ రాణి కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు; ఆమె అతనికి తెచ్చిన వాటికంటే ఎక్కువగా ఆమెకు ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.
15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ[c] బంగారం వినియోగించారు. 16 సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ[d] బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.
17 తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి. 19 ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు. 20 రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు. 21 హీరాము[e] మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.
22 రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు. 23 దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి భూలోక రాజులందరూ సొలొమోనును చూడాలని కోరారు. 24 ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.
25 గుర్రాల కోసం, రథాల కోసం రాజైన సొలొమోనుకు నాలుగువేల శాలలు ఉన్నాయి. పన్నెండువేలమంది గుర్రపు రౌతులున్నారు. రథాలలో కొన్నిటిని రౌతులలో కొందరిని వాటికోసం కట్టిన పట్టణాల్లో ఉంచాడు. కొన్ని యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. 26 యూఫ్రటీసు నది ఒడ్డునుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు. 27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. 28 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, ఇతర అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు.
Languages