3 యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు. 4 అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు. 5 కాబట్టి యెహోవా అతని ఆధీనంలో రాజ్యాన్ని సుస్థిరం చేశారు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కాబట్టి అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి. 6 యెహోవా మార్గాల్లో నడవాలని అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు క్షేత్రాలను అషేరా స్తంభాలను యూదా దేశంలో లేకుండా తొలగించాడు.
7 తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు. 8 వారితో పాటు షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబీయా, టోబ్-అదోనియా అనే లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరాము అనే వారిని పంపాడు. 9 వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకుని యూదా అంతటా బోధించారు. వారు యూదాపట్టణాలన్నిటికి సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.
10 యూదా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు. 11 ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు.
12 యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలు, సామాగ్రి నిల్వజేసే గిడ్డంగుల పట్టణాలు కట్టించాడు. 13 యూదా పట్టణాల్లో అతనికి చాలా సంపద చేకూరింది. అతని దగ్గర యెరూషలేములో అనుభవం కలిగిన పోరాట వీరులున్నారు. 14 వారి పూర్వికుల వంశాల ప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది:
Languages