15 రాజైన సొలొమోను యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని, మేడలను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు పట్టణాలు కట్టడానికి నియమించిన వెట్టి పని చేసిన వారి వివరాలు. 16 (ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు. 17 సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు.) అతడు దిగువ బేత్-హోరోనును, 18 బయలతు, తన దేశంలోని ఎడారిలో ఉన్న తద్మోరును,[b] 19 తన ధాన్యాగారాలను, తన రథాలకు గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో లెబానోనులో తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
20 అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు. 21 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. నేటికీ వారు అలాగే ఉన్నారు. 22 అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, ప్రభుత్వ అధికారులు, అధికారులు, దళాధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులు. 23 అంతేకాక, సొలొమోను చేయించే పనిమీద 550 మంది ముఖ్య అధికారులు కూడా ఉన్నారు, వారు పనివారి మీది అధికారులు.
24 ఫరో కుమార్తె దావీదు పట్టణం నుండి సొలొమోను తన కోసం కట్టించిన భవనానికి వచ్చిన తర్వాత సొలొమోను మేడలను కట్టించాడు.
25 సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, సమాధానబలులు అర్పిస్తూ, వాటితో యెహోవా సముఖంలో ధూపం వేస్తూ మందిర నియమాలను నెరవేర్చాడు.
26 రాజైన సొలొమోను ఎదోములోని ఎర్ర సముద్రతీరాన ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు దగ్గర ఓడలను కూడా కట్టించాడు. 27 హీరాము సముద్రం గురించి తెలిసిన తన నావికులను సొలొమోను మనుష్యులతో పాటు పని చేయడానికి పంపించాడు. 28 వారు ఓఫీరుకు ప్రయాణం చేసి వెళ్లి 420 తలాంతుల[c] బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
<- 1 రాజులు 81 రాజులు 10 ->
Languages