Link to home pageLanguagesLink to all Bible versions on this site
7
సత్యం, కరుణా, ఉపవాసం
1 రాజైన దర్యావేషు పరిపాలనలో నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగవ దినాన యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది. 2 బేతేలువారు యెహోవాను బతిమాలుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును వారితో బాటు వారి మనుషులను పంపించారు. 3 మందిరం దగ్గరనున్న యాజకులతో ప్రవక్తలతో “ఇన్ని సంవత్సరాలుగా మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించమంటారా” అని మనవి చేశారు.

4 సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,

5 “దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి.

జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా?
నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?

6 మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు?

మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?

7 యెరూషలేములోనూ, దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశంలోనూ, పడమటి మైదాన భూముల్లోను ప్రజలు విస్తరించి క్షేమంగా ఉన్న కాలంలో పూర్వపు ప్రవక్తల ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకో లేదు గదా?”

8 యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,

9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.

సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి.
ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.

10 వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”

11 అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.

12 ధర్మశాస్త్రాన్ని గానీ, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సేనల ప్రభువు యెహోవా తన ఆత్మ ప్రేరణచేత తెలియజేసిన మాటలను గానీ, వినకుండా హృదయాలను వజ్రాల వలె కఠిన పరచుకున్నారు.

కనుక సేనల ప్రభువు యెహోవా దగ్గర నుండి మహోగ్రత వారి మీదికి వచ్చింది.

13 కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,

“నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.

14 వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను.

వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది.
ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”

<- జెకర్యా 6జెకర్యా 8 ->