Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
యెహోషువ శుద్ధీకరణ, ప్రశస్త వస్త్రధారణ
1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. 2 సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు. 3 యెహోషువ మురికి దుస్తులు ధరించుకుని దూత సమక్షంలో ఇంకా నిలబడి ఉన్నాడు.

4 అప్పుడు దూత అక్కడ నిలబడి ఉన్నవారిని పిలిచి, ఇతని మురికి దుస్తులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. “నేను నీ అపరాధాలను తొలగించాను. ప్రశస్తమైన దుస్తులతో నిన్ను అలంకరిస్తున్నాను” అని చెప్పాడు. 5 “అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు.

6 అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా చెప్పాడు. 7 సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.

8 ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే,

‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.

9 యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని జాగ్రత్తగా చూడండి.

ఆ రాయికి ఏడు కళ్ళు ఉన్నాయి.
నేను దాని మీద అక్షరాలు చెక్కుతాను.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
“ఒక్క రోజులో నేను ఈ దేశ ప్రజల అపరాధాలను తొలగిస్తాను. 10 ఆ రోజుల్లో మీరు ద్రాక్షచెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడానికి ఒకరినొకరు పిలుచుకుంటారు.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

<- జెకర్యా 2జెకర్యా 4 ->