Link to home pageLanguagesLink to all Bible versions on this site
7
అదనపు వివరణ
1 ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు.

2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా 3 “మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు.

ఇశ్రాయేలులో శేషించిన వారి లెక్క
4 సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందినవారి సంఖ్య 1, 44,000.

5 గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య.

యూదా గోత్రంలో 12,000.
రూబేను గోత్రంలో 12,000.
గాదు గోత్రంలో 12,000.

6 ఆషేరు గోత్రంలో 12,000.

నఫ్తాలి గోత్రంలో 12,000.
మనష్షే గోత్రంలో 12,000.

7 షిమ్యోను గోత్రంలో 12,000.

లేవి గోత్రంలో 12,000.
ఇశ్శాఖారు గోత్రంలో 12,000.

8 జెబూలూను గోత్రంలో 12,000.

యోసేపు గోత్రంలో 12,000.
బెన్యామీను గోత్రంలో 12,000.
మహా బాధల కాలంలో నుండి వచ్చిన యూదేతరులు
9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,
“రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”
అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. 14 అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు. 15 అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. 16 వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.

17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”

<- యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8 ->