Link to home pageLanguagesLink to all Bible versions on this site
99
1 యెహోవా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా కూర్చుని ఉన్నాడు. భూమి కంపిస్తుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు. రాజ్యాలన్నిటి పైగా ఆయన ఉన్నతంగా ఉన్నాడు.
3 వాళ్ళు నీ ఘన నామాన్ని స్తుతిస్తారు. యెహోవా పవిత్రుడు.
4 రాజు బలశాలి. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు నీతి న్యాయాలను సుస్థిరం చేశావు, యాకోబు ప్రజల పట్ల నీతి పాలన స్థాపించావు.
5 మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు.
6 ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు.
7 మేఘస్తంభంలో నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయన శాసనాలను పాటించారు. ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించారు.
8 యెహోవా మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు. వాళ్ళ అక్రమ కార్యాలకు వాళ్ళను శిక్షించినా, నువ్వు వాళ్ళను క్షమించిన దేవుడివి.
9 మన యెహోవా దేవుడు పవిత్రుడు, మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతం ఎదుట ఆరాధించండి.

<- కీర్తనలు 98కీర్తనలు 100 ->