Link to home pageLanguagesLink to all Bible versions on this site
84
ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. కోరహు వారసుల కీర్తన.
1 సేనల ప్రభువైన యెహోవా, నువ్వు నివసించే చోటు ఎంత మనోహరం!
2 యెహోవా మందిరావరణాల కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. తహతహలాడుతూ ఉంది. సజీవ దేవుని కోసం నా హృదయం, నా సమస్తం కేకలు పెడుతున్నది.
3 సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.
4 నీ ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు, వాళ్ళు ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు.
సెలా
5 ఎవరి బలమైతే నీలోనే ఉన్నదో వాడు ధన్యుడు. సీయోను రాజమార్గాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ధన్యుడు.
6 వారు విలాప లోయగుండా వెళుతూ నీటి ఊటలు కనుగొంటారు. తొలకరి వాన దాన్ని జలమయంగా చేస్తుంది.
7 వాళ్ళ బల ప్రభావం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రతివాడూ సీయోనులో దేవుని ఎదుట కనబడతాడు.
8 యెహోవా, సేనల ప్రభువైన దేవా, నా ప్రార్థన విను. యాకోబు దేవా, నేను చెప్పేది ఆలకించు.
సెలా.
9 దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు.
10 నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.
11 యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు.
12 సేనల ప్రభువైన యెహోవా, నీ మీద నమ్మకం ఉంచేవాళ్ళు ధన్యులు.

<- కీర్తనలు 83కీర్తనలు 85 ->