Link to home pageLanguagesLink to all Bible versions on this site
63
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినది
1 దేవా, నా దేవుడివి నీవే. మనసారా నిన్ను వెదుకుతాను. నీళ్లు లేక ఎండిపోయిన ప్రాంతంలో నా ప్రాణం నీకోసం దప్పిగొని ఉంది. నిన్ను చూడాలని నా శరీరం ఆత్రుతతో ఎదురు చూస్తున్నది.
2 నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.
3 నీ నిబంధన నమ్మకత్వం జీవం కంటే శ్రేష్టం. నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి.
4 నీ పేరున నా చేతులు పైకెత్తి నా జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను.
5 కొవ్వు, మూలుగ తిన్నట్టుగా నా ప్రాణం తృప్తిగా ఉంది. ఆనందించే పెదాలతో నా నోరు నిన్ను కీర్తిస్తుంది.
6 రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.
7 నువ్వు నాకు సహాయం చేశావు. నీ రెక్కల నీడలో నేను సంతోషిస్తాను.
8 నా ప్రాణం నీపై ఆనుకుని ఉంది. నీ కుడిచెయ్యి నాకు ఆధారంగా ఉంది.
9 నా ప్రాణం తీయాలని వెతుకుతున్నవారు భూమి అడుగు భాగాలకు దిగిపోతారు.
10 వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.
11 అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.

<- కీర్తనలు 62కీర్తనలు 64 ->