Link to home pageLanguagesLink to all Bible versions on this site
62
ప్రధాన సంగీతకారుని కోసం. ఎదూతూను అనే రాగంతో పాడేది. దావీదు కీర్తన
1 నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.
2 ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నా ఉన్నతమైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.
3 ఎన్నాళ్లు మీరంతా ఒక్క మనిషిపై దాడి చేస్తారు? ఒకడు ఒరిగిపోయే గోడను, పడిపోతున్న కంచెను కూలదోసినట్టు నీవు[a] ఎంతకాలం ఒక్కణ్ణి కూలదోయాలని చూస్తారు?
4 గౌరవప్రదమైన స్థానం నుండి అతణ్ణి పడదోయడానికే వారు అతనితో ఆలోచిస్తారు. అబద్ధాలు చెప్పడం వారికి సంతోషం. వారు తమ నోటితో దీవెనలు పలుకుతూ వారి హృదయాల్లో మాత్రం అతన్ని శపిస్తారు.
5 నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.
6 ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు
7 దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.
8 ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.
9 నిజానికి తక్కువ స్థాయి మనుషులు ఎందుకూ పనికిరానివారు. గొప్పవారేమో మాయలాంటివారు. త్రాసులో వారంతా తేలిపోతారు. వారందరినీ కలిపి తూచినా వారు గాలికన్నా తేలికగా ఉన్నారు.
10 బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు.
11 ప్రభావం తనదే అని దేవుడు ఒకసారి చెప్పాడు. రెండుసార్లు నేనా మాట విన్నాను.
12 కృప చూపడం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభూ, మనుష్యులందరికీ వారు చేసిన క్రియల ప్రకారం నువ్వే ప్రతిఫలమిస్తున్నావు.

<- కీర్తనలు 61కీర్తనలు 63 ->