Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
ప్రధాన సంగీతకారుని కోసం, వేణువులతో పాడవలసినది. దావీదు కీర్తన.
1 యెహోవా, నా మొర విను. నా మూలుగుల గురించి ఆలోచించు.
2 నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే.
3 యెహోవా, ఉదయాన నా ఆర్తనాదం నువ్వు వింటావు. తెల్లవారే నా విన్నపం[a] నీ దగ్గరికి తెచ్చి ఆశతో కనిపెట్టుకుని ఉంటాను.
4 నువ్వు దుష్టత్వాన్ని సమర్ధించే దేవుడివి కాదు. చెడుతనం చేసే వాళ్ళు నీ అతిథులుగా ఉండరు.
5 దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు.
6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.
7 నేనైతే నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. భయభక్తులు కలిగి నీ పవిత్రాలయం వైపు వంగి నమస్కరిస్తాను.
8 యెహోవా, నా శత్రువులను బట్టి నీ నీతి మార్గంలో నన్ను నడిపించు. నా ఎదుట నీ మార్గం తిన్నగా చెయ్యి.
9 వాళ్ళ నోట సత్యం లేదు. వాళ్ళ అంతరంగం దుర్మార్గం. వాళ్ళ కంఠం తెరిచిన సమాధి. వాళ్ళు తమ నాలుకతో ఇచ్చకాలు పలుకుతారు.
10 దేవా, వాళ్ళను అపరాధులుగా ప్రకటించు. వాళ్ళ పథకాలే వాళ్ళ పతనానికి కారణం అగు గాక! అసంఖ్యాకమైన వారి అతిక్రమాలనుబట్టి వాళ్ళను తరిమి కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు.
11 నీలో ఆశ్రయం కోరిన వాళ్ళు అందరూ సంతోషిస్తారు గాక. నువ్వు వారిని సంరక్షిస్తావు గనక వారు ఉప్పొంగిపోతారు గాక. నీ నామాన్ని ప్రేమించే వాళ్ళు నీలో ఆనందిస్తారు గాక.
12 ఎందుకంటే యెహోవా, నువ్వు న్యాయవంతులను ఆశీర్వదిస్తావు. నీ డాలుతో కప్పినట్టు నువ్వు వాళ్ళను దయతో ఆవరిస్తావు.

<- కీర్తనలు 4కీర్తనలు 6 ->