Link to home pageLanguagesLink to all Bible versions on this site
34
అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన.
1 అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది.
2 నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక!
3 నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం.
4 నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు.
5 ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు.
6 అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు.
7 యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.
8 యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి.
9 యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు.
10 సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి.
11 పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.
12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?
13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.
14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
15 యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి.
16 చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు.
17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.
18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.
19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.
20 ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు.
21 చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు.
22 యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.

<- కీర్తనలు 33కీర్తనలు 35 ->