33
1 నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.
2 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.
3 ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.
4 ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.
5 ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.
6 యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.
7 ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.
8 భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.
9 ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.
10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
11 యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
12 యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
13 ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
14 తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు.
15 అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
16 ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
17 గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
18 చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,
19 యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.
20 మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే.
21 మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.