Link to home pageLanguagesLink to all Bible versions on this site
32
దావీదు రాసిన కీర్తన, మస్కిల్. దైవధ్యానం.
1 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.
2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.
3 నేను నిశ్శబ్దంగా ఉండి రాత్రంతా మూల్గుతున్నాను. దాంతో నా ఎముకలు బలహీనమై పోతున్నాయి.
4 పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది.
సెలా.
5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు.
సెలా.
6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.
7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.
8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.
9 వివేకం లేని గుర్రం లాగానో, గాడిద లాగానో ఉండకు. వాటిని అదుపు చేయాలంటే కళ్ళెం ఉండాలి. అవి నువ్వు కోరిన చోటికి వెళ్ళవు.
10 దుర్మార్గులకు ఎన్నో దిగుళ్ళు ఉన్నాయి. అయితే యెహోవాలో నమ్మకం ఉంచిన వాణ్ణి ఆయన నిబంధన కృప ఆవరించి ఉంటుంది.
11 నీతిపరులారా, యెహోవాలో సంతోషంగా ఉండండి. ఆయనలో ఉత్సాహంగా ఉండండి. హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్ళు ఆనందంతో కేకలు వేయండి.

<- కీర్తనలు 31కీర్తనలు 33 ->