Link to home pageLanguagesLink to all Bible versions on this site
29
దావీదు కీర్తన.
1 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!
2 యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.
3 యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.
4 యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.
5 యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
6 ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు.
7 యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.
9 యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.
10 యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.
11 యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.

<- కీర్తనలు 28కీర్తనలు 30 ->