Link to home pageLanguagesLink to all Bible versions on this site
25
దావీదు కీర్తన.
1 యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
2 నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
3 నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
6 యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
7 బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
9 దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
10 ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
11 యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
12 యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
13 అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
14 ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
15 నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
16 నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
17 నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
18 నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
19 నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
20 నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
21 నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
22 దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

<- కీర్తనలు 24కీర్తనలు 26 ->