16
దావీదు మిఖ్తీమ్ (ప్రశస్థ) కీర్తన.
1 దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు.
2 నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.
3 భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే.
4 యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను.
5 యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది.
6 మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది.
7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.
8 అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!
9 అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను.
10 ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు.
11 జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
<- కీర్తనలు 15కీర్తనలు 17 ->