Link to home pageLanguagesLink to all Bible versions on this site
116
1 యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను.
2 ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.
3 మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది.
4 అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను.
5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.
6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.
7 నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.
8 మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.
9 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
10 నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి.
11 నేను తొందరపడి ఏ మనిషీ నమ్మదగినవాడు కాదు, అనుకున్నాను.
12 యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను?
13 రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను.
14 యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.
15 యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.
16 యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను
18 ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.
19 యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

<- కీర్తనలు 115కీర్తనలు 117 ->