Link to home pageLanguagesLink to all Bible versions on this site
పంచమ పరిచ్ఛేదము
107
కీర్త 107-150
1 యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.
2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,
3 తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.
4 వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.
5 ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.
6 వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
7 వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.
8 ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
9 ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.
10 చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.
11 దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.
12 కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.
13 కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు
14 వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.
15 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
16 ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.
17 బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.
18 భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.
19 కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.
20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.
21 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
23 ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు
24 యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.
25 ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.
26 వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి*వారి నావికులు ప్రాణం కరిగిపోయింది.
27 మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.
28 బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.
30 అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.
31 ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
32 జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.
33 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,
34 దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.
35 అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.
36 వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,
37 వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.
38 ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.
39 వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,
40 శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.
41 అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.
42 యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.
43 బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.

<- కీర్తనలు 106కీర్తనలు 108 ->