Link to home pageLanguagesLink to all Bible versions on this site
103
దావీదు కీర్తన.
1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
3 ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
4 నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
5 నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
6 యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
7 ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
9 ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
13 తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
14 మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
15 మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
16 దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
17 యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
18 వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
21 యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
22 యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

<- కీర్తనలు 102కీర్తనలు 104 ->