Link to home pageLanguagesLink to all Bible versions on this site

కీర్తనలు
గ్రంథకర్త
ఇది గీతాల, పద్యాల సంకలనం. అనేక మంది కవుల రచనలతో కూడిన పాత నిబంధన గ్రంథం. ఇందులో దావీదు 73, ఆసాపు 12, కోరహు కుమారులు 9, సొలొమోను 3, ఏతాను, మోషేలు చెరొకటి రాశారు. (కీర్తన 90). 51 కీర్తన ఎవరు రాశారో తెలియదు. మోషే మినహా మిగతావారంతా దావీదు పరిపాలన కాలంలో ఆలయంలో ఆరాధన కీర్తనలు, సంగీతాలు సమకూర్చే బాధ్యత కలిగిన యాజకులు, లేవీయులు.
రచనా కాలం, ప్రదేశం
క్రీ. పూ. 1440 - 586
కొన్ని కీర్తనలు మోషే జీవించిన కాలమంత పురాతనమైనవి. అప్పటినుంచి దావీదు, ఆసాపు, సొలొమోను కాలాల గుండా బబులోను చెరకాలంలో నివసించిన ఎజ్రాహీయిల వరకు ఈ గీతాల రచన జరిగింది. అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో రచన జరిగింది.
స్వీకర్త
ఇశ్రాయేలు జాతి. చరిత్ర అంతటిలో దేవుడు తమ కోసం, విశ్వాసులందరి కొసం చేసిన దాన్ని వారికి గుర్తు చేసే కీర్తనలు.
ప్రయోజనం
కీర్తనల్లో దేవుని సృష్టి, యుద్ధాలు, ఆరాధన, పాపం, దుష్టత్వం, తీర్పు, న్యాయం, మెస్సియా రాక, మొదలైన అంశాలున్నాయి. ఇందులోని అనేక కీర్తనలు పాఠకులను దేవుడు ఎవరో ఆయన చేసినది ఏమిటో వాటి నిమిత్తం ఆయన్ని స్తుతించమని ప్రోత్సహిస్తున్నాయి. కష్టకాలంలో దేవుని మహాత్మ్యాన్ని వర్ణిస్తూ, ఆయన విశ్వసనీయతను స్థితరపరుస్తూ, ఆయన వాక్కుకు ఉన్న కేంద్రస్థానాన్ని మనకు గుర్తు చేస్తాయి.
ముఖ్యాంశం
స్తుతి.
విభాగాలు
1. మెస్సియా గ్రంథం — 1:1-41:13
2. అభిలాష గ్రంథం — 42:1-72:20
3. ఇశ్రాయేలు గ్రంథం — 73:1-89:52
4. దైవ పరిపాలన గ్రంథం — 90:1-106:48
5. స్తుతి గ్రంథం — 107:1-150:6

ప్రథమ పరిచ్ఛేదము
1
కీర్త 1-41
1 దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.
2 అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.
3 అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.
4 దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.
5 కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు.
6 నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.

కీర్తనలు 2 ->