Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.

2 మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.

3 దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.

4 మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.

5 దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.

6 బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.

7 మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.

8 కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.

9 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.

10 యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.

11 ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.

12 విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.

13 సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.

14 వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?

15 తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.

16 ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.

17 వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.

18 చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.

19 పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.

20 ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.

21 జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.

22 భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.

23 నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.

24 ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.

<- సామెతలు 17సామెతలు 19 ->