Link to home pageLanguagesLink to all Bible versions on this site

నహూము
గ్రంథకర్త
గ్రంథకర్త తన పేరును నహూముగా పేర్కొన్నాడు (హీబ్రూలో ఈ పేరుకు అర్ధం “ఓదార్చేవాడు, ఆదరించే వాడు”). ఇతడు ఎల్కోషు ఊరివాడు (1:1). ప్రవక్తగా దేవుడు ఇతన్ని అషురు ప్రజల, ముఖ్యంగా వారి రాజధాని నీనెవే పశ్చాత్తాపం కోసం పంపాడు. యోనా సందేశం విని వారు పశ్చాత్తాపపడినది దీనికి 150 సంవత్సరాలకు ముందు, కాబట్టి ఆ ప్రజలు మరలా గతంలోని తమ విగ్రహ పూజలకు తిరిగిపోయారని అర్ధమవుతున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 663 - 612
నహూము గ్రంథ రచన కాలాన్ని తేలికగానే నిర్ణయించవచ్చు. తేబేను నగర విధ్వంసం, నీనెవె పతనం అనే రెండు ప్రధాన చారిత్రిక అంశాల మధ్య కాలంలో పుస్తక రచన జరిగింది.
స్వీకర్త
ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించి చెరపట్టి తీసుకుపోయిన అషురు వారికి దేవుడు ఈ గ్రంథంలోకి సందేశం పంపిస్తున్నాడు. అంతేగాక తమకూ అదే గది పడుతుందేమోనని భయపడుతున్న దక్షిణ యూదా సామ్రాజ్యానికి కూడా ఇందులో సందేశం ఉంది.
ప్రయోజనం
దేవుని తీర్పు న్యాయమైనది, అది తప్పకుండా వస్తుంది. కొంత కాలం పాటు కనికరం చూపాలని ఆయన నిర్ణయించుకున్నట్టయితే, ఆయన ఆవిధంగా ఆగడం ఆయన అంతిమన్యాయ తీర్పుకు అడ్డు రాదు. దేవుడు 150 సంవత్సరాలకు ముందే వారి వద్దకు యోనా ప్రవక్తను పంపించాడు. వారు తమ దుర్మార్గాల్లో కొనసాగితే ఏమి జరుగుతుందో హెచ్చరించాడు. ఆ కాలంలో ప్రజలు పశ్చాత్తాప పడ్డారు. కాని ప్రస్తుతం అంతకు ముందుకన్నా అధ్వాన్నమైన స్ధితిలో ఉన్నారు. అష్హురు వారు తాము ఓడించిన రాజ్యాల పట్ల అత్యంత కౄరంగా ప్రవర్తించేవారు. ఇప్పుడు నహూము యూదా ప్రజలతో భయపడవద్దని చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన తీర్పును ప్రకటించాడు. అష్హురు వారికి తగిన శిక్ష వారి మీదకి వస్తుంది.
ముఖ్యాంశం
ఓదార్పు
విభాగాలు
1. దేవుని తేజస్సు — 1:1-14
2. దేవుని తీర్పు, నీనెవె — 1:15-3:19

1 ఇది నీనెవె పట్టణం గురించిన దేవుని వాక్కు. ఎల్కోషు నివాసి నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం.

నీనెవె పట్టణం మీద దేవుని కోపం
2 యెహోవా రోషం గలవాడు. ఆయన ప్రతీకారం చేస్తాడు. ఆయన తీవ్రమైన కోపంతో ఉన్నాడు. యెహోవా తన శత్రువులపై ప్రతీకారం చేస్తాడు. ఆయనకు విరోధంగా ప్రవర్తించే వారి మీద కోపం తెచ్చుకుంటాడు. 3 యెహోవా తొందరగా కోపం తెచ్చుకోడు. ఆయన సర్వ శక్తిశాలి. దోషులను ఆయన నిర్దోషులుగా చూడడు. యెహోవా తుఫానులో నుండి, సుడిగాలిలో నుండి వస్తాడు. మేఘాలు ఆయన కాలి కింద మన్ను లాగా ఉన్నాయి. 4 ఉప్పొంగే సముద్రాన్ని ఆయన గద్దించి ఆణిగిపోయేలా చేస్తాడు. నదులన్నీ ఎండిపోయేలా చేస్తాడు. బాషాను, కర్మెలు వాడిపోతాయి. లెబానోను పువ్వులు వాడిపోతాయి.

5 ఆయనపట్ల కలిగిన భయం వల్ల పర్వతాలు కదిలిపోతాయి. కొండలు కనిపించకుండా కరిగి పోతాయి. ఆయన ఎదుట నిలువలేక భూమి వణికిపోతుంది. భూమి, దానిపై నివసించేవారంతా ఆయన అంటే భయపడతారు. 6 ఆయన తీవ్రమైన కోపాన్ని తట్టుకోగలిగేవాడు ఎవడు? ఆయన ఉగ్రత ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. ఆయన కోపం అగ్ని ప్రవాహంలాగా పారుతుంది. ఆయన కొండలను బద్దలయ్యేలా చేస్తాడు. 7 యెహోవా ఉత్తముడు, బాధ కలిగినప్పుడు ఆయన ఆశ్రయం కలిగిస్తాడు. తనపై నమ్మకం ఉంచేవాళ్ళు ఆయనకు తెలుసు. 8 పొంగి పొర్లుతున్న నీళ్ళలాగా ఆయన ఆ నగరాన్ని నాశనం చేస్తాడు. తన శత్రువులు చీకటిలోకి పారిపోయే వరకూ ఆయన తరుముతాడు. 9 యెహోవాను గూర్చి మీరు పన్నుతున్న కుట్రలేమిటి? రెండవసారి ఆపద కలగకుండా ఆయన దాన్ని పూర్తిగా నివారిస్తాడు. 10 శత్రువులు ద్రాక్షారసం తాగి మత్తెక్కి ముళ్ళకంపల్లాగా చిక్కుబడి పోయి ఎండిపోయిన చెత్తలాగా కాలిపోతారు.

11 నీనెవే పట్టణమా, నీలో నుండి ఒకడు బయలుదేరాడు. వాడు యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన సంగతులు బోధిస్తాడు. 12 యెహోవా చెబుతున్నదేమిటంటే, వాళ్ళు బలప్రభావాలు కలిగిన విస్తారమైన జనమైనప్పటికీ కోత కాలంలో పంట కోత జరిగినప్పుడు అంతా నాశనమైపోతారు. యూదా, నేను నిన్ను బాధ పెట్టినట్టు ఇక ఎన్నడూ బాధపెట్టను. 13 వాళ్ళు మీపై మోపిన కాడిని విరిచివేస్తాను. వారి బంధకాలను తెంచివేస్తాను.

14 నీనెవే పట్టణమా, నీ గురించి యెహోవా ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, నీ పేరు పెట్టుకొనేవాళ్ళు ఇకపై పుట్టరు. నీ ఆలయాల్లో చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ఒక్కటి కూడా లేకుండా అన్నిటినీ నాశనం చేస్తాను. నువ్వు నీచుడవు గనక నీకు సమాధి సిద్ధం చేస్తున్నాను. 15 శాంతి సందేశం ప్రకటిస్తూ, సమాధాన శుభ సమాచారం బోధించే వారి పాదాలు పర్వతాల మీద కనిపిస్తున్నాయి. యూదా ప్రజలారా, మీ ఉత్సవాలు జరుపుకోండి. మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఇప్పటి నుండి దుర్మార్గుడు దండెత్తి మీ మధ్యకు రాడు. వాడు సమూలంగా నాశనం అయ్యాడు.

నహూము 2 ->