Link to home pageLanguagesLink to all Bible versions on this site
21
యాజకులు కోసం నియమాలు
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “యాజకులైన అహరోను కొడుకులతో ఇలా చెప్పు. మీలో ఎవరూ మీ ప్రజల్లో శవాన్ని ముట్టుకుని తనను అపవిత్రం చేసుకోకూడదు. 2 అయితే తన రక్త సంబంధులు, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, సోదరుడు, 3 తన ఇంట్లో నివసిస్తున్న పెండ్లి కానీ కన్య అయిన సోదరి గానీ చనిపోతే ఆ శవాన్ని తాకడం వల్ల తనను అపవిత్ర పరచుకోవచ్చు.

4 యాజకుడు తన భార్య తరుపు బంధువుల కోసం తనను అపవిత్ర పరచుకుని మైల పడకూడదు.

5 యాజకులు బోడిగుండు చేసుకోకూడదు. గడ్డం పక్కలను క్షవరం చేసుకో కూడదు. కత్తితో శరీరాన్ని గాట్లు పెట్టుకోకూడదు. 6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్ట పాలు చెయ్యకూడదు. ఎందుకంటే వారు తమ దేవునికి ‘నైవేద్యం’ అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించే వారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి.

7 వారు వేశ్యను గానీ చెడిపోయిన దాన్ని గానీ పెళ్లాడకూడదు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

8 అతడు నీ దేవుడికి ‘నైవేద్యం’ అర్పించే వాడు గనక నీవు అతణ్ణి పరిశుద్ధపరచాలి. మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవా అనే నేను పవిత్రుణ్ణి గనక అతడు మీ దృష్టికి పవిత్రుడుగా ఉండాలి.

9 యాజకుని కూతురు వేశ్యగా తనను అపవిత్రపరచు కున్నట్టైతే ఆమె తన తండ్రికి అప్రదిష్ట తీసుకువస్తుంది. ఆమెను సజీవ దహనం చెయ్యాలి.

10 సోదరుల్లో ప్రధాన యాజకుడు కావడానికి ఎవరి తలమీద అభిషేక తైలం పోస్తారో, ప్రధాన యాజక దుస్తులు ధరించడానికి ఎవరు ప్రతిష్ట అవుతారో అతడు తన జుట్టు విరబోసుకోకూడదు. తన బట్టలు చింపుకోకూడదు. 11 అతడు శవం ఉన్న చోటికి పోకూడదు. తన తండ్రి శవం మూలంగా గానీ తన తల్లి శవం మూలంగా గానీ మైల పడకూడదు.

12 ప్రధానయాజకుడు పరిశుద్ధమందిరాన్ని విడిచి వెళ్లకూడదు. తన దేవుని పరిశుద్ధ మందిరాన్ని మైల పడేలా చెయ్యకూడదు. ఎందుకంటే తన దేవుని అభిషేక తైలం వల్ల అతడు ప్రధాన యాజకునిగా అభిషేకం పొందాడు. నేను యెహోవాను.

13 అతడు కన్యను మాత్రమే పెళ్ళాడాలి. 14 వితంతువును గానీ విడాకులు తీసుకున్న స్త్రీని గానీ వేశ్యను గానీ అలాటి వారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి. 15 అతడు ఈ నియమాలు పాటించాలి. యెహోవా అనే నేను అతణ్ణి పవిత్రపరిచే వాణ్ణి గనక అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్ర పరచకూడదు.”

16 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. 17 “నీవు అహరోనుతో ఇలా చెప్పు. నీ సంతానంలో ఎవరికైనా కళంకమేదైనా కలిగితే అతడు తన దేవుడికి నైవేద్యం అర్పించడానికి సమీపించ కూడదు. 18 ఎందుకంటే ఎవరిలో కళంకం ఉంటుందో, అంటే వాడు గుడ్డి వాడైనా, కుంటివాడైనా, వికృత రూపి అయినా, 19 కాలు గానీ చెయ్యి గానీ అవిటితనం ఉన్నా, 20 గూనివాడైనా, మరుగుజ్జువాడైనా, కంటి దోషం లేక జబ్బు ఉన్నవాడైనా, గజ్జి, పక్కు ఉన్నవాడైనా వృషణాలు నలిగినవాడైనా అలాంటివాడు సమీపించకూడదు.

21 యాజకుడైన అహరోను సంతానంలో అవిటితనం గలవారెవరూ యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించడానికి దగ్గరికి రాకూడదు. అతడు అవిటి వాడు. అలాటి వాడు తన దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరికి రాకూడదు. 22 అతి పరిశుద్ధమైనవిగాని, పరిశుద్ధమైనవిగాని, తన దేవునికి అర్పించే ఏ ఆహార వస్తువులైనా అతడు తినొచ్చు. 23 మొత్తం మీద అతడు అవిటితనం గలవాడు గనక అడ్డతెర ఎదుటికి అతడు రాకూడదు. బలిపీఠం సమీపించకూడదు. 24 నా పరిశుద్ధ స్థలాలను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పు.” మోషే ఈ విధంగా అహరోనుతో, అతని కొడుకుల తో ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పాడు.

<- లేవీకాండం 20లేవీకాండం 22 ->