Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
కృప కోసం ప్రార్థన
1 యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో.
మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.

2 మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది.

మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి.

3 మేము అనాథలం అయ్యాం.

తండ్రులు ఇంక లేరు.
మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు.

4 మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం.

మా కట్టెలు మాకే అమ్మారు.

5 వాళ్ళు మమ్మల్ని తరిమారు.

మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.

6 అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం.

7 మా పితరులు[a] పాపం చేసి చనిపోయారు.

మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం.

8 దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు.

9 ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం.

10 కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది.

11 శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు.

12 అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు.

13 బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.

14 పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు.

యువకులను సంగీతం నుంచి దూరం చేశారు.

15 మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.

16 మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!

17 మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి.

18 సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.

19 యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది.

20 నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు?

మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?

21 యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం.

22 నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.

<- విలాప వాక్యములు 4