4
సీయోనుకు శిక్ష
1 బంగారం ఎలా మెరుగు మాసింది! మేలిమి బంగారం ఎలా మాసిపోయింది!
ప్రతి వీధి మొదట్లో ప్రతిష్టితమైన రాళ్లు చెల్లాచెదరుగా పారేసి ఉన్నాయి.
2 సీయోను కుమారులు శ్రేష్ఠులు. వాళ్ళు మేలిమి బంగారం కంటే విలువైన వాళ్ళు.
అయితే వాళ్ళు ఇప్పుడు కుమ్మరి చేసిన మట్టికుండల్లాగా అందరూ వారిని చూస్తున్నారు.
3 నక్కలైనా చన్నిచ్చి తమ పిల్లలకు పాలు ఇస్తాయి.
కాని నా ప్రజల కుమారి ఎడారిలోని నిప్పు కోడి అంత క్రూరంగా ఉంది.
4 దప్పిక వల్ల పాలు తాగే పిల్ల నాలుక దాని అంగిటికి అంటుకుంటూ ఉంది.
పిల్లలు అన్నం అడుగుతారు, కాని వాళ్ళు తినడానికి ఏమీ లేదు.
5 ఒకప్పుడు రుచికరమైన భోజనం తిన్నవాళ్ళు ఇప్పుడు దిక్కు లేకుండా వీధుల్లో ఆకలితో ఉన్నారు.
ఒకప్పుడు ఊదారంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చెత్తకుప్పలను ఆశ్రయించారు.
6 నా ప్రజల కుమారి చేసిన పాపం సొదొమ పాపం కంటే ఎక్కువ. ఎవరూ దాని మీద చెయ్యి వెయ్యకుండానే అకస్మాత్తుగా అది పడిపోయింది.
7 సీయోను నాయకులు మంచులా మెరిసే వాళ్ళు. పాలవలే తెల్లని వాళ్ళు.
వాళ్ళ శరీరాలు పగడం కంటే ఎర్రనివి. వాళ్ళ దేహకాంతి నీలం లాంటిది.
8 కానీ ఇప్పుడు చీకటి వారి ముఖాలను నల్లగా చేసేసింది.
వాళ్ళు వీధుల్లో గుర్తు పట్టలేనట్టుగా ఉన్నారు.
వాళ్ళ చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకు పోయింది.
అది ఎండిపోయిన చెక్కలా అయ్యింది!
9 కత్తిపోటుతో హతమైన వాళ్ళ పరిస్థితి పొలంలో పంటలేక క్షీణించి కరువుతో హతమైన వాళ్ళ పరిస్థితికన్నా మెరుగు.
10 కరుణ గల స్త్రీల చేతులు తాము కన్న తమ సొంత పిల్లలను వండుకున్నాయి.
నా ప్రజల కుమారికి వచ్చిన నాశన కాలంలో వాళ్ళ పిల్లలు వాళ్లకు ఆహారం అయ్యారు.
11 యెహోవా తన కోపం తీర్చుకున్నాడు. తన కోపాగ్ని కుమ్మరించాడు.
ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు. అది దాని పునాదులను కాల్చేసింది.
12 భూరాజులు గాని, ప్రపంచ నివాసులు గాని,
ఒక శత్రువు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించగలడని ఎవరూ అనుకోలేదు.
13 దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల,
దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
14 ఇప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళలా వీధుల్లో తిరుగుతున్నారు.
వాళ్ళు రక్తం అంటిన అపవిత్రులు.
అందుకే ఎవరూ వాళ్ళ వస్త్రాలైనా ముట్టలేక పోతున్నారు.
15 ప్రజలు కేకపెడుతూ “పొండి! శుద్ధి లేని వాళ్ళలారా పొండి! నన్ను ముట్టుకోవద్దు” అన్నారు.
వాళ్ళు పారిపోయి తిరుగులాడుతూ ఉన్నప్పుడు అన్యప్రజలు వాళ్ళతో,
“విదేశీయులు ఇంక ఇక్కడ ఉండకూడదు” అంటున్నారు.
16 యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు.
ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు.
ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు.
17 దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు.
రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.
18 మా వీధుల్లో మేము నడవకుండా మా విరోధులు మా జాడ పసిగట్టి మమ్మలి వెంటాడారు.
మా చివరి దశ దగ్గర పడింది. మా రోజులు ముగిసిపోయాయి.
మా అంతం వచ్చేసింది.
19 మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు.
పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.
20 మా నాసికారంధ్రాల ఊపిరి, యెహోవా చేత అభిషేకం పొందిన మా రాజు, వాళ్ళు తవ్విన గుంటల్లో పడి దొరికిపోయాడు.
21 “అతని నీడ కింద అన్యప్రజల మధ్య బతుకుదాం” అని మేము ఎవరి గురించి అనుకున్నామో వాడు శత్రువుల చేజిక్కాడు.
ఊజు దేశంలో నివాసం ఉన్న ఎదోము కుమారీ, సంతోషించు, ఉల్లాసంగా ఉండు.
ఈ గిన్నెలోది తాగే వంతు నీకూ వస్తుంది. నువ్వు దానిలోది తాగి మత్తుగా ఉండి నిన్ను నువ్వు నగ్నంగా చేసుకుంటావు.
22 సీయోను కుమారీ, నీ శిక్ష ముగిసింది. ఇంక ఎన్నడూ ఆయన నిన్ను బందీగా చెరలోకి తీసుకు పోడు.
ఎదోము కుమారీ, నీ పాపానికి ఆయన శిక్ష వేస్తాడు. నీ పాపాలను ఆయన బయట పెడతాడు.
<- విలాప వాక్యములు 3విలాప వాక్యములు 5 ->