23
యెహోషువ చివరి ఉపదేశం
1 చుట్టూ ఉన్న వారి శత్రువుల నుండి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ చేసిన తరువాత చాలా రోజులకు యెహోషువ ముసలివాడై పోయాడు. 2 యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలనూ వారి నాయకులనూ వారి న్యాయాధిపతులనూ వారి అధికారులనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు, “నేను ముసలివాడినైపోయాను. 3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ రాజ్యాలన్నిటికీ చేసినదంతా మీరు చూశారు. మీ తరఫున యుద్ధం చేసింది మీ దేవుడు యెహోవాయే! 4 చూడండి, యొర్దాను నుండి పడమరగా మహాసముద్రం వరకూ నేను నాశనం చేసిన అన్ని రాజ్యాలతో పాటు, మీ గోత్రాల స్వాస్థ్యం మధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాన్ని మీకు చీట్లు వేసి పంచిపెట్టాను. 5 మీ దేవుడైన యెహోవాయే వారిని వెళ్ళగొడతాడు. ఆయనే వాళ్ళను పారదోలతాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వారి దేశాన్ని స్వాధీన పరచుకుంటారు. 6 కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు. 7 మీ దగ్గర మిగిలి ఉన్న ఈ రాజ్యాలతో కలిసిపోవద్దు. వారి దేవుళ్ళ పేరులు ఎత్తవద్దు, వాటి తోడని ప్రమాణం చేయవద్దు, వాటిని పూజించవద్దు. వాటికి నమస్కరించవద్దు. 8 దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి. 9 బలీయమైన గొప్ప రాజ్యాలను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇప్పటివరకూ మీముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. 10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు. 11 కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ ఉండడానికి శ్రద్ధ వహించండి. 12 అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే 13 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరనుండి ఈ రాజ్యాలను వెళ్ళగొట్టడం మానుకుంటాడని మీరు తెలుసుకోవాలి. దానికి బదులు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి ప్రదేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యే వరకూ వారు మీకు ఉరిగా బోనుగా మీపక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్లులాగా ఉంటారు.
14 ఇప్పుడు మనుషులందరిలాగే నేనూ పోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో చేసిన వాగ్దానాల్లో ఒక్కటికూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు. అవన్నీ మీకు జరిగాయి. వాటిలో ఒక్కటికూడా తప్పిపోలేదు. 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు. 16 మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి, ఇతర దేవుళ్ళను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండాా మీరు త్వరగా నాశనమవుతారు.”
<- యెహోషువా 22యెహోషువా 24 ->