2 దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. 3 అతడు తన మనుషులను పంపి “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు” అని రాహాబుకు కబురు పంపాడు.
4 ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, 5 వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. 6 అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.
7 రాజు పంపిన ఆ మనుషులు యొర్దాను నది దాటే రేవుల వెంబడి వాళ్ళను పట్టుకోవడానికి వెళ్లారు. తరమడానికి వెళ్ళిన మనుషులు బయటికి వెళ్ళగానే కోట తలుపులు మూసేశారు.
8 ఆ గూఢచారులు పడుకొనే ముందు, ఆమె వాళ్ళున్న మిద్దె ఎక్కి వాళ్ళతో ఇలా అంది, 9 “యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు. 10 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం. 11 వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.
12 కాబట్టి ఇప్పుడు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. నేను మీకు ఉపకారం చేసినట్టే మీరూ నా తండ్రి కుటుంబానికి ఉపకారం చేయండి. 13 నా తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ కుటుంబాలన్నిటినీ చావు నుండి రక్షిస్తామని నాకు కచ్చితమైన ఒక ఆనవాలు ఇవ్వండి” అంది.
14 అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు.
15 ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది, ఆమె ప్రాకారం మీద నివాసం ఉంటున్నది కాబట్టి తాడువేసి కిటికీ గుండా వాళ్ళని దింపింది. 16 ఆమె “మిమ్మల్ని తరమడానికి వెళ్ళినవాళ్ళు మీకెదురొస్తారేమో, వారు తిరిగి వచ్చేవరకూ మీరు కొండలకు వెళ్లి మూడురోజులు అక్కడ దాక్కుని ఉండండి, తరువాత మీ దారిన మీరు వెళ్ళండి” అని వారితో చెప్పింది.
17 ఆ మనుషులు ఆమెతో “మేము ఈ దేశానికి వచ్చేవాళ్ళం కాబట్టి నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము నిర్దోషులమయ్యేలా 18 మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్ర తాడు కట్టి, నీ తండ్రినీ నీ తల్లినీ నీ అన్నదమ్ములనూ నీ తండ్రి కుటుంబం మొత్తాన్నీ నీ ఇంటికి తెచ్చుకో. 19 నీ ఇంట్లోనుండి ఎవరన్నా బయటికి వస్తే మాత్రం తన ప్రాణానికి తానే బాధ్యుడు, మేము నిర్దోషులం. అయితే నీ దగ్గర నీ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఏ అపాయమైనా కలిగితే దానికి మేమే జవాబుదారులం. 20 నీవు మా సంగతి వెల్లడి చేస్తే నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మాకు దోషం ఉండదు” అన్నారు.
21 అందుకు ఆమె “మీ మాట ప్రకారం జరుగుతుంది” అని చెప్పి వాళ్ళను పంపివేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్ర తాడును కిటికీకి కట్టింది. 22 వారు వెళ్లి కొండలు ఎక్కి తమను తరిమేవారు తిరిగి వచ్చేవరకూ మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. తరిమేవారు ఆ మార్గమంతా వారిని వెదికారు గానీ వారు కనబడలేదు.
23 ఆ ఇద్దరు మనుషులు కొండలు దిగి యొర్దాను నది దాటి నూను కుమారుడు యెహోషువ దగ్గరికి వచ్చి తమకు జరిగిందంతా అతనితో వివరంగా చెప్పారు. 24 వారు “ఆ దేశమంతా యెహోవా మన చేతికి కచ్చితంగా ఇచ్చేశాడు. మన గురించిన భయంతో ఆ దేశనివాసులందరికీ ధైర్యం చెడింది” అని యెహోషువతో చెప్పారు.
<- యెహోషువా 1యెహోషువా 3 ->