Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
యోబు జవాబు
1 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు.
2 నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు?
3 మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు.
4 ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు.
5 పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు.
6 భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.
7 ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు.
8 ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.
9 స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.
10 ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.
11 ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు.
12 ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు?
13 దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు.
14 కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?
15 నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను.
16 నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు.
17 ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు.
18 ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.
19 బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు.
20 నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.
21 నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు.
22 తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు.
23 ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు.
24 భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయన గాక ఇంకెవరు?
25 పరుగు తీసే వాడి కంటే వేగంగా, ఎలాంటి మంచీ లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి.
26 రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.
27 నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకున్నానా?
28 నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది.
29 నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?
30 నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,
31 నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
32 ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలసి న్యాయస్థానానికి వెళ్ళడం ఎలా?
33 మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.
34 ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి.
35 అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను, అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను.

<- యోబు 8యోబు 10 ->