Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
1 నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
2 తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
3 మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
4 అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
5 ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
6 దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
7 నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
8 అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
9 ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
10 ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
11 ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
12 వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
13 దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
14 వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
15 బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
16 కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
17 దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
18 ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
19 ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
20 కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
21 దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
22 కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
23 నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
24 నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
25 నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
26 ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
27 ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో.

<- యోబు 4యోబు 6 ->