Link to home pageLanguagesLink to all Bible versions on this site
13
1 ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,
2 మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.
3 నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.
4 మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
5 మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.
6 దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.
7 మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?
8 ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?
9 ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?
10 మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.
11 ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
12 మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.
13 నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.
14 నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.
15 వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.
16 దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.
17 నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.
18 ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.
19 నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.
20 దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.
21 నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.
22 అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.
23 నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.
24 నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?
25 అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?
26 నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.
27 నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.
28 కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.

<- యోబు 12యోబు 14 ->