Link to home pageLanguagesLink to all Bible versions on this site
12
యోబు జవాబు
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
2 నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా?
3 మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు?
4 దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది.
5 క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు.
6 దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు.
7 అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి.
8 భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి.
9 యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు?
10 జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.
11 నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా.
12 వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది.
13 అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
14 ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు.
15 చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడిచేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి.
16 బలమూ, జ్ఞానమూ ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు.
17 ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు.
18 రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు.
19 యాజకులను వస్త్రహీనులనుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్ళను ఆయన కూలదోస్తాడు.
20 వాక్చాతుర్యం గలవారు చెప్పే మాటలను ఆయన వ్యర్ధపరుస్తాడు. పెద్దమనుషులను తెలివితక్కువ వాళ్లనుగా చేస్తాడు.
21 పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు.
22 చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలు పరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు.
23 ఆయన ప్రజలను వృద్ది పరుస్తాడు, అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాల పరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకు పోతాడు.
24 లోకంలోని ప్రజల, పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారీతెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు.
25 వాళ్ళు వెలుగు లేనివారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలి పడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు.

<- యోబు 11యోబు 13 ->