Link to home pageLanguagesLink to all Bible versions on this site
17
1 యూదా పాపం వజ్రపు కొన ఉన్న ఇనుప కలంతో రాసి ఉంది. అది వారి హృదయాలు అనే పలకల మీద, మీ బలిపీఠాల కొమ్ముల మీద చెక్కి ఉంది.
2 వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే.
3 సరిహద్దుల్లోని పర్వతాల మీదున్న వారి బలిపీఠాలు వారికి గుర్తే. నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని దోపుడు సొమ్ముగా నేనప్పగిస్తాను. మీ పాపం మీ దేశమంతా ఉంది.
4 నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు.
5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.
6 వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.
7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.
8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.
9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.
11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.”
12 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది.
13 యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు.
14 యెహోవా, నన్ను బాగు చెయ్యి. నేను బాగుపడతాను! నన్ను కాపాడు. నేను క్షేమంగా ఉంటాను. నువ్వే నా స్తుతి పాట.
15 వాళ్ళు “యెహోవా వాక్కు ఎక్కడుంది? దాన్ని రానివ్వు” అంటున్నారు.
16 నేను నిన్ను అనుసరిస్తూ కాపరిగా ఉండడం మానలేదు. విపత్తుదినం కోసం నేను ఎదురు చూడలేదు. నా నోట నుంచి వచ్చిన మాటలు నీకు తెలుసు. అవి నీ దగ్గరనుంచే వచ్చాయి.
17 నువ్వు నాకు భయకారణంగా ఉండవద్దు. విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం.
18 నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు.
విశ్రాంతి దినం గురించి హెచ్చరిక
19 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి యూదా రాజులు వచ్చిపోయే కోట గుమ్మంలో, ఆ తర్వాత యెరూషలేము ద్వారాలన్నిటిలో నిలబడు.
20 వారితో ఇలా చెప్పు, యూదా రాజులారా! యూదా ప్రజలారా! యెరూషలేము నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించే మీరంతా యెహోవా మాట వినండి.
21 యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు.
22 విశ్రాంతి దినాన మీ ఇళ్ళలోనుంచి బరువులు మోసుకుపోవద్దు. మరి ఏ పనీ చేయవద్దు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పవిత్ర దినంగా ఆచరించండి.
23 అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.”
24 యెహోవా ఇలా చెప్పాడు. “మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతి దినాన మరే పనీ చేయక దాన్ని పవిత్ర దినంగా ఆచరించండి. విశ్రాంతి దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా బరువులు తీసుకు రాకండి.
25 అప్పుడు దావీదు సింహాసనమెక్కే రాజులూ అధిపతులూ ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాల మీదా గుర్రాల మీదా ఎక్కి తిరిగే రాజులూ అధిపతులూ యూదావారూ యెరూషలేము నివాసులూ వస్తారు. ఈ పట్టణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
26 ప్రజలు దహనబలులనూ బలులనూ నైవేద్యాలనూ ధూపద్రవ్యాలనూ స్తుతియాగ ద్రవ్యాలనూ నా మందిరానికి తెస్తారు. వాళ్ళు యూదా పట్టణాల్లో నుంచి, యెరూషలేము ప్రాంతాల్లో నుంచి, బెన్యామీను దేశంలో నుంచి, మైదాన ప్రాంతంలో నుంచి, కొండసీమ నుంచి, దక్షిణ ప్రదేశం*దక్షిణ ప్రదేశం నెగెబు నుంచి వస్తారు.
27 అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.”

<- యిర్మీయా 16యిర్మీయా 18 ->