Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
గిద్యోను
1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 2 మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు.

3 ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండేవాళ్ళు, తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండు లాగా వాళ్ళ మీదికి వచ్చి 4 వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు. 5 వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి. 6 దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు.

7 మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు 8 యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను. 9 ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే. 10 మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’ ”

11 అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, 12 యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, 13 గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు.

14 అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. 15 అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు.

16 అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు. 17 అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు, 18 నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు.

19 అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు. 20 దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు. 21 అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. 22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు. 23 అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు.

24 అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది. 25 ఆ రాత్రే యెహోవా “నీ తండ్రికి చెందిన ఎద్దును, ఏడేళ్ళ వయస్సు ఉన్న రెండవ యెద్దును తీసుకు వచ్చి, నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి, దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నరికివెయ్యి. 26 సరి అయిన ఏర్పాటుతో ఈ బండ పైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, ఆ రెండవ ఎద్దును తీసుకు వచ్చి నువ్వు నరికిన ఆషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహనబలి ఆర్పించు” అని అతనితో చెప్పాడు.

27 కాబట్టి గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్టు చేసాడు. అతడు తన తండ్రుల కుటుంబాల వారికి, ఆ ఊరివాళ్ళకు భయపడిన కారణంగా పగటి వేళ కాక, రాత్రి సమయంలో చేసాడు. 28 ఆ ఊరివాళ్ళు వేకువనే లేచినప్పుడు బయలు దేవుడు బలిపీఠం విరగ్గొట్టి ఉంది. దానికి పైగా ఉన్న దేవతా స్తంభం కూడా పడద్రోసి ఉంది. కొత్తగా కట్టిన బలిపీఠంపై రెండవ ఎద్దు అర్పణ అయిపోయి కనిపించింది.

29 అప్పుడు వాళ్ళు, ఇది ఎవరు చేసిన పని, అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాకబు చేసి, యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు.

30 కాబట్టి ఆ ఊరివాళ్ళు “నీ కొడుకు బయలు బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభాన్ని పడద్రోశాడు గనుక అతడు చనిపోవాలి, వాణ్ణి బయటకు తీసుకురా” అని యోవాషుతో చెప్పారు. 31 యోవాషు, తనతో పోట్లాడుతున్న వాళ్ళందరితో “మీరు బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలును రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు పొద్దు ఎక్కక ముందే చావాలి. ఎవడో బయలు బలిపీఠాన్ని విరగ్గొట్టాడు సరే, బయలు దేవుడే కదా, తన పక్షాన తానే వాదించుకోనివ్వండి.” 32 ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా, ఆ దినాన గిద్యోనుకు “యెరుబ్బయలు” అని పేరు వచ్చింది.

33 మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు తీరం వాళ్ళు కలిసివచ్చి, నది దాటి, యెజ్రెయేలు మైదానంలో దిగినప్పుడు 34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబీకులు అతని దగ్గరికి వచ్చారు. 35 అతడు మనష్షె వారి దగ్గరికి దూతలను పంపగా వారంతా కలిసి అతని దగ్గరికి వచ్చారు. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాలవాళ్ళ దగ్గరికి దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా కూడుకొన్న వాళ్ళను కలుసుకున్నారు.

36 అప్పుడు గిద్యోను దేవునితో “నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే, 37 నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను” అన్నాడు. 38 అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు.

39 అప్పుడు గిద్యోను “నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు” అని దేవునితో అన్నప్పుడు 40 ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.

<- న్యాయాధిపతులు 5న్యాయాధిపతులు 7 ->