4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి. 5 మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. 6 మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు.
9 సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. 10 నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. 11 చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.
12 నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.
13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి. 14 మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15 విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.
16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది. 17 ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. 18 అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.
19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే 20 అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.
<- యాకోబు రాసిన పత్రిక 4