16
1 నిర్జన ప్రదేశం వైపు ఉన్న సెల నుంచి దేశాన్ని పరిపాలన చేసే వాడికి, సీయోను కుమార్తె పర్వతానికి పొట్టేళ్లను పంపండి.
2 గూటి నుంచి చెదిరి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు కుమార్తెలు కనిపిస్తారు.
3 “ఆలోచన చెప్పు. న్యాయం అమలు చెయ్యి. చీకటి కమ్మినట్టు మధ్యాహ్నం పూట నీ నీడ మా మీద ఉండనివ్వు. పలాయనంలో ఉన్నవాళ్ళను దాచి పెట్టు. పారిపోయిన వాళ్ళను పట్టిచ్చి ద్రోహం చెయ్యకు.
4 మోయాబు నుంచి పలాయనం అయిన వాళ్ళను నీతో నివాసం ఉండనివ్వు. నాశనం చేసే వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా వాళ్లకు దాక్కునే చోటుగా ఉండు.” ఎందుకంటే బలాత్కారం ఆగిపోతుంది. నాశనం నిలిచిపోతుంది. అణగదొక్కేవాళ్ళు దేశంలో నుండి అదృశ్యం అవుతారు.
5 నిబంధనా నమ్మకత్వంతో సింహాసన స్థాపన జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు. అతడు తీర్పు తీరుస్తాడు, న్యాయం వెదకుతాడు, నీతి జరిగిస్తాడు.
6 మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.
7 కాబట్టి మోయాబీయులు మోయాబును గూర్చి విలపిస్తారు. అందరూ విలపిస్తారు. మీరు పూర్తిగా పాడైన కీర్ హరెశెతు ద్రాక్షపళ్ళ గుత్తుల కోసం మూలుగుతారు.
8 ఎందుకంటే హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్షాతీగెలు వాడిపోయాయి. దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జాతుల అధికారులు అణగదొక్కారు. అవి యాజరు వరకూ వ్యాపించాయి, ఎడారిలోకి పాకాయి. దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.
9 యాజరుతో కలిసి నేను సిబ్మా ద్రాక్షాతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లతో నిన్ను తడుపుతాను. ఎందుకంటే నీ వేసవికాల ఫలాల మీద, నీ పంట మీద నీ కేరింతలను నేను అంతమొందించాను.
10 ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను.
11 మోయాబు కోసం నా గుండె కొట్టుకుంటోంది. కీర్ హరెశెతు కోసం నా అంతరంగం తీగవాయిద్యంలా నిట్టూర్పు విడుస్తోంది.
12 మోయాబీయులు ఉన్నత స్థలానికి వచ్చి సొమ్మసిల్లి ప్రార్థన చెయ్యడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు, వారి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
13 ఇంతకు ముందు యెహోవా మోయాబు గురించి చెప్పిన మాట ఇదే.
14 మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. “మూడేళ్ళలోపు మోయాబు ఘనత అదృశ్యం అవుతుంది. అతనికి అనేకమంది జనం ఉన్నా చాలా తక్కువగానూ ప్రాముఖ్యత లేనివాళ్ళుగానూ ఉంటారు.”
<- యెషయా 15యెషయా 17 ->