దీని రచయిత యెషయా పేరును బట్టి ఈ పుస్తకానికి పేరు వచ్చింది. ఇతడొక ప్రవక్తను వివాహమాడగా వారికి కనీసం ఇద్దరు మగపిల్లలు పుట్టారు (యెషయా 7:3; 8:3). నలుగురు యూదా రాజులు (ఉజ్జియా, యెతాము, ఆహాజు, హిజ్కియా 1:1) పరిపాలన కాలంలో ఇతడు ప్రవచనాలు చెప్పాడు. ఐదవ రాజు దుర్మార్గుడైన మనష్హే పాలనలో హతమయ్యాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 740 - 680
ఉజ్జియా రాజు పరిపాలన చివరి దశలో యెతాము, ఆహాజు, హిజ్కియా పరిపాలన కాలంలో ఈ గ్రంథ రచన జరిగింది.
స్వీకర్త
దేవుని ధర్మశాస్త్ర విధుల ప్రకారం జీవించకుండా తప్పిపోతున్న యూదా ప్రజలకోసం ఈ గ్రంథంలోని ప్రవచనాలు ఉన్నాయి.
ప్రయోజనం
పాత నిబంధన అంతటిలొకీ అత్యంత సమగ్రమైన రీతిలో యేసుక్రీస్తును చూపేపే చిత్రాన్ని ఆవిష్కరింప జేయడం యెషయా గ్రంథం ఉద్దేశం. ఆయన జీవితం యొక్క విస్త్రత వర్ణన ఇందులో ఉంది. ఆయన రాకడ ప్రకటన (40:3-5), ఆయన కన్యకు జన్మించడం (7:14), ఆయన ప్రకటించనున్నసువార్త (61:1), త్యాగభరిత మరణం (52:13-53:12), తన వారిని పొందడం కోసం ఆయన మళ్ళీ రావడం (60:2-3) యెషయా ప్రవక్త పిలుపు ముఖ్యంగా యూదా రాజ్యానికి ప్రవచనాలు వినిపించడం. యూదా రాజ్యం తిరుగుబాటు, ఉజ్జీవం అనుభవిస్తున్నది. అష్హురు, ఈజిప్టు రాజ్యాలు యూదాను నాశనం చేస్తామని బెదిరిస్తున్నాయి. అయితే దేవుని కరుణను బట్టి ఆ బెదిరింపులను ఆ జాతి తప్పించుకోగలుగుతున్నది. పాపం విషయంలో పశ్చాత్తాపం, దేవుని విమోచన లభించే భవిష్యత్తు అనే ప్రకటన యెషయా ప్రవచనాల్లో కనిపిస్తుంది.
ముఖ్యాంశం
రక్షణ
విభాగాలు
1. యూదా భ్రష్టత్వం — 1:1-12:6
2. ఇతర జాతుల భ్రష్టత్వం — 13:1-23:18
3. భావి హింసాకాలం — 24:1-27:13
4. ఇశ్రాయేలు యూదాల భ్రష్టత్వం — 28:1-35:10
5. హిజ్కియా మరియు యెషయా చరిత్ర — 36:1-38:22
6. బాబిలోనియన్ నేపద్యం — 39:1-47:15
7. శాంతికై దేవుని ప్రణాళిక — 48:1-66:24
1
దుర్మార్గానికి పాల్పడి చెడిపోయిన యూదులు
1 యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.
2 ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు.
“నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు.
3 ఎద్దుకు తన యజమాని తెలుసు.
తన మేత తొట్టి గాడిదకు తెలుసు.
కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.”