14
పశ్చాత్తాపడమని పిలుపు
1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి.
మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు.
అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.
3 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు.
మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము.
‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము.
తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”
4 వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను.
వారి మీదనున్న నా కోపం చల్లారింది.
మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.
5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను.
తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు.
లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
6 అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి.
ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది.
లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.
7 అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు.
ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు.
ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు.
లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.
8 ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?”
నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను.
నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను.
నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి.
నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.
9 ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు?
వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు?
ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి.