Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
హబక్కూకు ప్రార్థన
1 ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది).

2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను.

యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు.
ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి.
కోపంలో కనికరం మరచిపోవద్దు.

3 దేవుడు తేమాను[a]లో నుండి వచ్చాడు.

పరిశుద్ధ దేవుడు పారాను[b]లో నుండి వేంచేస్తున్నాడు (సెలా).
ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది.
భూమి ఆయన స్తుతితో నిండి ఉంది.

4 ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి.

అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు.

5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి.

ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి.

6 ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు.

నిత్య పర్వతాలు బద్దలైపోయాయి.
పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.

7 కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను.

మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి.

8 యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా?

నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా?
సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా?

9 విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు.

భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు.

10 పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి.

జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి.
సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది.

11 నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు.

12 బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు.

మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు.

13 నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు.

నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు.
దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా).

14 పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు.

15 నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు.

నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి.

16 నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.

17 అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా,

ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా,
ఒలీవచెట్లు కాపులేక ఉన్నా,
చేనులో పైరు పంటకు రాకపోయినా,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,

18 నేను యెహోవా పట్ల ఆనందిస్తాను.

నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను.

19 ప్రభువైన యెహోవాయే నాకు బలం.

ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు.
ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.

<- హబక్కూకు 2