Link to home pageLanguagesLink to all Bible versions on this site
44
సంచిలో వెండి గిన్నె
1 యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు, 2 చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.

3 తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు. 4 వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి? 5 నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు. 6 అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు. 7 వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.

8 చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము? 9 నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం” అని అతనితో అన్నారు. 10 గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు. 11 అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు. 12 ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. 13 వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.

14 అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు. 15 అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు. 16 యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు. 17 యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు.

బెన్యామిను కోసం యూదా వేడికోలు
18 యూదా అతని సమీపించి “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా. 19 నా యజమానులైన మీరు, ‘మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?’ అని తమ దాసులను అడిగారు. 20 అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము. 21 అప్పుడు తమరు, ‘నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి’ అని తమ దాసులతో చెప్పారు.

22 అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము. 23 అందుకు తమరు, ‘మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని తమ దాసులతో చెప్పారు. 24 కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము. 25 మా తండ్రి, ‘మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి’ అని చెబితే 26 ‘మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము’ అని చెప్పాము.

27 అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు. 28 వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు. 29 మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు.

30 కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే 31 మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. 32 తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను. 33 కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి. 34 ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.

<- ఆదికాండం 43ఆదికాండం 45 ->