5 పైన గదులకు వసారాలుండడం వలన వాటి ఎత్తు తక్కువై మధ్యగదులు ఇరుకుగా ఉన్నాయి. 6 మూడో అంతస్థులో ఉన్న గదులకు ఆవరణకు ఉన్న స్తంభాలు లేవు కాబట్టి అవి కింద గదులకంటే, మధ్య గదులకంటే చిన్నవిగా కట్టి ఉన్నాయి. 7 గదుల వరుసను బట్టి బయటి ఆవరణ వైపు గదులకు ఎదురుగా 27 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడ ఉంది. 8 బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది. 9 ఈ గదులు గోడకింద నుండి లేచినట్టుగా కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించడానికి తూర్పువైపున మార్గం ఉంది.
10 ఖాళీ స్థలానికి, కట్టడానికి ఎదురుగా ఆవరణపు గోడ వారున తూర్పువైపు కొన్ని గదులున్నాయి. 11 వాటి ఎదుట ఉన్న మార్గం ఉత్తరం వైపు ఉన్న గదుల మార్గం లాగా ఉంది. వాటి కొలతల ప్రకారమే ఇవి కూడా కట్టి ఉన్నాయి. వీటి ద్వారాలు కూడా వాటి లాగానే ఉన్నాయి. 12 దక్షిణం వైపు గదుల తలుపుల్లాగా వీటి తలుపులు కూడా ఉన్నాయి. ఆ మార్గం ఆవరణంలోకి పోయేవారికి తూర్పుగా ఉన్న గోడ ఎదురుగానే ఉంది.
13 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం. 14 యాజకులు లోపల ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి బయటి ఆవరణంలోకి పోకుండా అక్కడే తాము పరిచర్యకు ధరించే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితాలు కాబట్టి ప్రజలకు చెందిన దేనినైనా వారు తాకాలంటే వారు వేరే బట్టలు ధరించుకోవాలి.”
15 అతడు లోపలి మందిరాన్ని కొలవడం ముగించి నన్ను బయటికి తీసుకొచ్చి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి వచ్చి చుట్టూ కొలిచాడు. 16 తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది. 17 ఉత్తరం వైపు 270 మీటర్లు, 18 దక్షిణం వైపు 270 మీటర్లు, 19 పడమర వైపు 270 మీటర్లు ఉంది. 20 ఆవిధంగా అతడు నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన, పవిత్రం కాని స్థలాలను వేరు చేయడానికి దానిచుట్టూ నాలుగు వైపులా 270 మీటర్లు ఉన్న నలుచదరపు గోడ కట్టి ఉంది.
<- యెహెజ్కేలు 41యెహెజ్కేలు 43 ->