7 నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను. 8 ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 9 ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి. 10 ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
11 “ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు. 12 దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది. 13 ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు. 14 దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు. 15 దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు. 16 హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”
17 “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు. 18 బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు. 19 మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి. 20 నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 21 నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు. 22 ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు. 23 ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు. 24 వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.
25 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను. 26 వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు. 27 అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. 28 వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు. 29 అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
<- యెహెజ్కేలు 38యెహెజ్కేలు 40 ->